కాఫీవిత్ గీతా వెల్లంకి,రమాదేవి,లీలారెడ్డి కాఫీ కవితలు‌‌..1114

*కాఫీవిత్ గీతా వెల్లంకి,రమాదేవి,లీలారెడ్డి
కాఫీ కవితలు‌‌..1114
*కాఫీ’..అంటే నాకెందుకు  ఇష్టమంటే…??
*మీరెన్నైనా చెప్పండి పొగలు గక్కే చిక్కటి
కాఫీ ముందు ఏదైనా దిగదుడుపే..!!
కాఫీ…కాఫీ..కాఫీ..పొగలు గక్కే వేడి కాఫీ సూర్యో
దయంతో పాటే గుక్కెడు కాఫీ నోట్లోపడందే తోచి చావదు.‌ఇంతకూ ఈ కాఫీలో ఏముందబ్బా !ఇంత
గా అడిక్ట్ కావడానికికారణమేమైవుంటుంది.కాఫీలో చికోరి,పాలుమాత్రమే కాదండోయ్.‌! ఇంకేదో మనకు తెలీని మమకారపు దినుసులు వుండి వుండాలి.!
లేకుంటే …
ఉదయాన్నే ఆ కాఫీ వాసనకు నిలువెల్లాఎలా
పులకించి పోతాం? కాఫీకి అంతగా దాసాను
దాసులై పోతాం..చిక్కటి గుమ్మపాలలో కాస్తంత
ఫిల్టర్ కాఫీ డికాషన్ ను కలిపి,గిలకొట్టి, అలా సిప్
చేయడానికి శ్రీకారం చుట్టినప్పుడు ,దాని ఘుమ ఘుమలు నాసికా పుటాలకు చేరితే..అంతకంటే
ఆనందం…పరమానందం ఇంకేం వుంటుంది..?
గుమ్మపాలకాఫీ నురుగును జుర్రుకుంటున్నప్పడు
కలిగేరుచి,ఆనందం,అనుభూతి అద్భుతం….
అనన్యం.!
కొందరికి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం.ఇంకొందరికి కోల్డ్
కాఫీ అంటే ఇష్టం..నాలాంటివాళ్ళకు బ్రౌన్ కాఫీ…
ఇష్టం.రంగేదైనా,రుచేదైనా,వాసనేదైనా కాఫీ కాఫీనే.
కాఫీకి మించిన గ్లోబల్ పానీయం ఇంకేదీ లేదన్నది
నా వ్యక్తిగతాభిప్రాయం.‌కాఫీ అంటే కాఫీనే..కాఫీకి
సాటి వేరొకటి వుందని నేననుకోను.కొందరు కాఫీ
గురించి ఏదేదో మాట్లాడతారు..నెగిటివ్ గా మాట్లా
డతారు.
మీరెన్నైనా చెప్పండి పొగలు గక్కే చిక్కటి కాఫీ…
ముందు ఏదైనా దిగదుడుపే. కాఫీమంచిది కాదన్న
మాట నా చెవిన పడితే మాత్రం మనస్సు చివుక్కు
మంటుంది..చికాకేస్తుంది..చిర్రుమంటుంది..అన్న వాళ్ళ మీద పడి రక్కేయ్యాలన్నంత కోపంవస్తుంది.
సరే వాళ్ళన్నట్టే కాఫీలో చికోరి ఆరోగ్యానికి హాని
చేస్తుందనే అనుకుందాం! కమ్మని కాఫీకూడా తాగ
లేని ఆరోగ్యం ఎందుకండీ! ఆ మాటకొస్తే కాఫీతాగ
ని బతుకు‌ బతుకే కాదంటాను.కాఫీతాగనిబతుకూ
ఒక బతుకేనా? అలాంటి బతుకు నా కొద్దు గాక
వద్దు..సూర్యోదయానికి ఆహ్వానం పలికే కాఫీచైత
న్యానికి ప్రతీక‌.రాత్రంతా సుప్తావస్థలో వున్న శరీరా
నికి,మెదడుకు కాఫీ కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది.కమ్మగా…ఓ కప్పుకాఫీని లోపలికి పంపి చూడండి..మీలో కొత్త
ఉత్సాహం పురుడు పోసుకుంటుంది..బతుకు
మీద కొత్త ఆశ చిగురిస్తుంది..
అందుకే కాఫీ అంటే నాకంతిష్టం..కేవలం కాఫీయే
కాదండోయ్! కాఫీ కవితలన్నా ఇష్టమే సుమా..!!
*ఇప్పుడు కొన్ని ‘కాఫీ’...
’కవితల్ని చూద్దాం…!!
*గీతావెల్లంకి..(Geetha Vellanki))
కాఫీ కవిత…‌!!
*గీతమ్మకు బ్లాక్ కాఫీ…అంటే ఇష్టం..!!
జోరున వర్షం పడుతుంటే,లేక చలితో గజ గజ
వణుకుతుంటే మనమంతా పొగలుగక్కే వేడి
వేడి కాఫీ కోసమో?
లేక….
స్ట్రాంగ్ టీ కోసమో వెదుకుతాం..!
కానీ,
గీతా వెల్లంకి మాత్రం బ్లాక్ కాఫీ కోసంవెదుకుతుంది. అది కూడా కోల్డ్ కాఫీ అయితే ఇక ఆమెఆనందానికి
హద్దేవుండదు..అంతగా బ్లాక్(కోల్డ్) కాఫీని ఇష్టపడు
తుంది గీత.
మరి కాఫీ మాత్రమే కాదు..తన ఊహాజనిత సఖు
డన్నా కూడా ఆమెకు అంతే ఇష్టం! బ్లాక్ కాఫీని..,
సఖుడ్ని కలిపి మిక్సీలో వేసి గిరాటేస్తే ఈ  కవిత వచ్చి వుంటుంది.
మీరుకూడా ఓ సారి…మంచి బ్లాక్ కాఫీ లాంటి
ఈ కవితను చదవండి.ఆ తర్వాత తీరిగ్గామాట్లా
డుకుందాం.!.
❤️ బ్లాక్ కాఫీ...
కప్పులోకి దూకగానే
వేల కళ్ళేసుకుని నా వైపే చూస్తుంది
నురుగంతా తగ్గుతోందని
నల్లరంగు బయటేసి గాఢమైన వాసనతో పిలుస్తుంది...
రుచి తగలగానే
నిద్రమత్తు పోయి కళ్ళు విప్పారుతాయి!
నీవూ ఈ కాఫీ...
నిదురని దూరంచేసేవే కానీ...
జీవితానికి రవంత వెలుగునిచ్చేవి".!
*గీతా వెల్లంకి..!!
మీరు కాఫీ తాగేటప్పుడు ఎప్పుడైనా…
పరిశీలనగా చూశారా?
కాఫీ కలిపినప్పుడు (అది మామూలుకాఫీకావొచ్చు.
లేక బ్లాక్/ కోల్డ్ కాఫీ కావచ్చు..కప్పు/గ్లాసు పైననురు
గు కనబడుతుంది.ఆ నురుగులో చిన్నా,పెద్ధబుడగ
లు పైకితేలుతుంటాయి.వీటిని(కాఫీ)కళ్ళుగాఊహిం
చింది గీతమ్మ.కాఫీ కప్పులో పడగానే/దూకగానేవేల
కళ్ళేసుకుని తన వైపే చూస్తుందట.నురుగంతా తగ్గి
పోతున్న కొద్దీ తననల్లరంగు బయటేసి గాఢమైన వాసనతో కాఫీ పిలుస్తుంది."రా వమ్మా! గీతమ్మా! త్వరగాతాగిపెట్టు..అంటూ నురగారా పిలుస్తుంది..
ఇకనేం ఎలాగూ పిలిచింది కదా! అని కప్పు తీసుకొ
ని లిప్పుకు తగిలించి,ఓ సిప్పు లాగగానే జిహ్వకు రుచి తగలుతుంది.
ఆ ఆనందంనుంచి తేరుకునే  లోగానే నిద్ర మత్తు
వదిలి పోయి కళ్ళు కలువ పూల్లా ఆమెకు తెలీ
కుండానే విప్పారుతాయి.!
కేవలం (బ్లాక్) కాఫీనే కాదండోయ్..ప్రియ సఖుడి తలంపు/సమక్షం కూడా ఎంతటినిద్రనైనా తరిమేస్తా
యి..దూరం చేస్తాయి..అయితే…బ్లాక్ కాఫీ అయి
నా,సఖుడైనా..జీవితానికి రవంత వెలుగునిచ్చేవారే
సుమా! అంటోంది గీత..!!
'ఇష్టమైనది,లేక ఇష్టమైన వారు ఎవరైనా..మన
జీవితానికి వెలుగునిస్తారు..జీవితంలోఆనందాన్ని పంచుతారు' అన్నది ఈ కాఫీ కవిత సారాంశం.!
2*లీలారెడ్డి’ కాఫీ కవిత..!!
*పండగ పూట “లీలారెడ్డి”..(Coffee with
Leella reddy )  కాఫీ సేవనం..❤
పండగపూట...కాఫీ విత్ " లీలా రెడ్డి"గారికి ఉద
యాన్నే పొగలుగక్కే కాఫీ తాగటం ఓ మధురాను
భవం. అందులో చిక్కటిపాలతో పొగలుగక్కే ఫిల్టర్
కాఫీ అయితే,ఇక చెప్పనవసరం లేదు.అది కూడా ఎముకలు కొరికే చలిలో వేడివేడి కాఫీ లాగించడ మంటే..ఆనందం మన పక్కనే వున్నట్లే.!
ఆలా కాఫీతాగే...సమయంలో కమ్మని కవిత్వం చదివితే ఆ కాఫీకి  అదనపు రుచి (Additional flavour) కలుగుతుంది.రాత్రి బడలిక వదిలి బుర్ర
పదునవుతుంది. అద్భుతమైన అనుభూతి ఆవి
ష్కృతమవుతుంది. ఇది నా స్వీయానుభవం…..
అఫ్ కోర్స్…
లీలమ్మ అనుభవంకూడా ఇదేనని..
ఆమె కవిత చదివితే మీకే తెలుస్తుంది..
"కాఫీ  అంటే  కషాయం కాదులే
హాయిగొలిపే  మత్తు
అదో  హాయైన  గమ్మత్తు !
కాఫీ అంటే
తెల్లవారకముందే
నాసికాపుటాలను
తాకే సుగంధం
చలికీ  , చెలి (కాని) కీ
ముడిపడిన  బంధం
కాఫీ లేనిదే  ' డే ' గడవకపోవటం
విడ్డూరమేమీ  కాదుగా
మీ  యింట్లో , మా యింట్లో,
ఎవరింట్లోనైనా
సునయనా
ఇంటింటి  రామాయణం
ఇంతేలే చామంతీ !
కాఫీ లోని కమ్మదనం
జాజుల పరిమళం
బుల్లిపిట్టల  కిలకిలారావం
ఆస్వాదించని  బ్రతుకేల లీలా !
కప్పు  నిండా కాఫీ
చేతిలో  కలం
భావాలు సెగలో  పొగలై
విరజిమ్ము కదా
చామంతీ ! మేము సైతం అంటూ.....
కాఫీ అంటే
హాయి గొలిపే మత్తు
అదో హాయైన గమ్మత్తు ".
*హార్ట్ ఫిషియల్ …' లీల ' .!!
మరి అలాంటి కాఫీ తాగుతూ...మంచి కవిత్వం
చదువుతుంటే ఎలా వుంటుందో ఓసారి ఊహిం
చుకోండి.సిప్పు సిప్పుకు మధ్య అందమైన కవిత్వ
మధురిమల్ని ఆస్వాదిస్తూవుంటే..ఆ కిక్కేవేరు..!!
కవిత్వం ఆర్ట్ ఫిషియల్ గా వుంటే ఎంత చెత్తగా
వుంటుందో….హార్టిఫిషియల్ గా వుంటే అంత కమ్మగావుంటుంది.లీలగారి ఈ కవిత  "హార్ట్ ఫిషియల్ " చదవండి.!!
*హార్ట్ ఫిషియల్ ..!!
నా కలలో  కనిపించే  కమ్మటి కల నీవే
తన్మయంగా  వినిపించే  షాయరీ  నీవే !
మెలకువలోనే కలగంటున్న  కవిత్వము నీవే
గడచిపోయిన రేయిలో యుగళ గీతమూ నీవే!
ఎన్నో  యుగాల నిరీక్షణలో కరిగిపోనీక
కాలానికి  గేలమేసి వినిపించిన కథ నీవే!
జలజల రాలే జలపాతాల హోరులోనూ
నీదైన  శైలిలో వినపడే  సంగతులూ  నీవే!
మబ్బుచాటు చందమామ చెప్పిన ఊసుల్లో తొంగి
చూసి,బాసలు చేసి మాయమైన చెలిమివి నీవే!
నీవు రగిలించిన విరహాగ్నిలో దగ్థమైపోకుండా
మిగిలిన జ్ఞాపకానివి నీవనీ, నీవేననీ
ఎలా చెప్పను ! ఇంకెలా  చెప్పను ?
"నువ్వేం మాయ చేసావో  గానీ.......
నీ ప్రేమలో  పడిపోయా
పడకుండా ఎలా ఉండగలననుకున్నావ్ ?
ఆ అలౌకిక  ఆనందంలో....?
మునిగి తేలకుండా ఎలా ఉండగలనను
కున్నావ్ …!
ఆ రసమయ  ప్రేమ జగత్తులో! ?
కాఫీ చేసిన ' గమ్మత్తా ' ఇది అనుకున్నా......
కాదని  ఇటువైపుగా  వీచిన తుంటరి
చలిగాలి  చెప్పిందిలే!
ప్రకృతి లో పరవశించే మనసుకి తోడుగా
ఉన్నావని, నాతోపాటు నువ్వూ ప్రేమలో పడిపోయావనీ  ..!
ఇంకా విచ్చుకోని  వెలుగు రేఖలు కబురందిం
చాకే కలలపర్వం లో కలవరించిన మనసు పాడేనీరాగం గమ్మత్తుగా  ఉందింకా..!
అక్షరం మీద ప్రేమ కొద్దీ .. లీలా రెడ్డి గారు ఇలా
రాస్తూవుంటారు ఆమెఅక్షరాలకు..ఒయ్యారాలూ.
ఎక్కువే..ఓ పట్టాన.కుదురుగా కూర్చో నివ్వవు..
కునుకు తీయనివ్వవట గుండెను  కదిలించటం
కవ్వించి  నవ్వించటం చెమ్మతో చెలిమిచేయటం ,
జడ మెలిపెట్టి హొయలొలికించటం సామాన్యమై
న  విషయమా..!
అర్ధరాత్రీ  అపరాత్రీ  అని లేకుండా  కవి హృద
యం దాసోహమయ్యేంతగా, కవితకు ప్రేరణగా మరీ అంతఒయ్యారాలు పోకే,నా అక్షర సహచరీ అంటూ, ఆమె అక్షర సహచరిని అప్పుడప్పుడు సముదాయించు కుంటూ వుంటారు.
" ఏ వర్షం చినుకో,ఏ కన్నీటిచుక్కో ఏ పెరట్లో
పువ్వు పై వాలిన సీతాకోకచిలుకో
ఇంటికెదురుగా వున్న ఓ గుట్టో ఓ పూరేకో…..,
ఓపిచ్చుక గూడో ,కదిలించక పోతుందా .......
నా కలాన్ని తట్టి లేపదా"?" అంటారు లీలారెడ్డి.
“నీ కవితావేశపు దారుల వెంట .......
నన్ను కూడా నడువనీ
చిగురిoచే ఆశనై , మొగ్గ తొడిగే మమతనై ,
చెలియ నై , నీ చెలిమి నై .......
సఖా ! నా సఖా !
కొండా కోన వొంపుల్లో , సెలయేటి జాలులో ,
నీ కవితాసుధ ప్రవహించే వేళ
హత్తుకుని , అద్దుకొని ,
సుగంధాన్నై , అనురాగ బంధాన్నై ......
ఉండనీ , నన్నుoడనీ !
చెలియ నై , నీ చెలిమి నై ......”!!
జాబిల్లి  కోసం  కలువ నిరీక్షణ స్వాతి చినుకుకై
చకోర నిరీక్షణ! మౌనం  వీడని  నీ మనసుకై
ఎన్నో రాత్రుల నా ఈ నిరీక్షణ...  రేయంతా  ..
చందమామ తో సరాగాలాడిన తారలేమో..
తెల్లారేసరికి  ఇలా ఎరుపెక్కిన పారిజాతాలై " !!
ఓకవి పురివిప్పిన నెమలిలా  తన మనసులోని
భావాలను యిలా అక్షరాలుగా పరిస్తే, ఏ పాఠకు
డైనా ఆనందించ కుండా ఎలా వుండ  గలుగుతా
డు? 'కాఫీ' అయిన,'కవిత్వమైనా ,మనిషికి ఆనం
ద ప్రేరకాలే కదా…?


3*”రమాదేవి ఆర్. “ కాఫీ కవిత..!!


ప్రేయసీ ప్రియుల సంగమంలో కంటే ఎదురు
చూపులోనే అసలు మజా వుంటుంది.అతడి
కోసం ఆమె…ఆమె కోసం అతడు..నిరీక్షిస్తుం
టే ప్రతీ క్షణం ప్రేమపురుడు పోసుకుంటుంది.
కలిసిన క్షణాలకంటే ఎదురుచూపు చూసిన
క్షణాలే మత్తెక్కిస్తాయి...కొత్త కిక్కిస్తాయి.‌!
రమాదేవి ఈ మధ్య రాస్తున్న కవిత్వం ఇంచు
మించు ఇలానే వుంటోంది..ఈరోజు కాఫీటైమ్
కవిత కూడా ఇలాంటిదే.మీరూ ఓ సారి చదివి
తే ఓ పనైపోతుంది.ఆనక మనం దీని గురించి
వివరంగా మాట్లాడుకుందాం!


"నేను వెళ్లేసరికి ఎదురుపడిన
ఖాళీ కాఫీ కప్పు
వెక్కిరిస్తూ కనిపించింది
అతను వచ్చి వెళ్ళాడు కాబోలు..
అతను వేచి ఉండి వెళ్ళాడో
వేగిరిపడి వెళ్ళిపోయాడో
తేల్చుకునేది ఎలా.....
ఇప్పటికి .. అక్కడ
ఖాళీ చేయబడిన కాఫీ
అడుగంచున....
వదిలివెళ్ళిన ఎదురుచూపు
నువ్వే కదూ."..❤️

అతడు వస్తానన్న చోటికి ఆమె  వెళ్ళింది‌..
ఆయితే ఆ వెళ్ళడంలో కాస్తంత ఆలస్యమైం
ది.తీరా వెళ్ళి చూస్తే అతడక్కడ లేడు.అక్క
డో ఖాళీ కాఫీ కప్పు వెక్కిరిస్తూ కనబడింది..
ఇప్పుడామె మనసులో ఒకటే సంకోచం…
అతడొచ్చి వెళ్ళాడా?
ఖాళీ కాఫీ కప్పును చూస్తే..
అతడు వచ్చి వెళ్ళినట్లే వుంది.‌!
తన ఆలస్యానికి  మనసు చిన్నబోయింది..
పశ్చాత్తాపంతో  కొండెక్కుతున్న దీపంలా
కొట్టు కుంటోంది.
ఇప్పుడామె మనసులో రెండు ప్రశ్నలు
తలెత్తాయి.‌
ఒకటి…అతను తన కోసం వేచి చూశాడా?
లేదా?
లేక  …
తాను రాలేదని వేగిరిపడి వెళ్ళిపోయాడా?
ఈ చిక్కుము డిని విప్పుకోలేక..
నిజమేమిటో తెలుసుకోలేక.. మనసు
తుఫానుకు  నడిసంద్రంలో  చిక్కుకున్న
నావలాగ ఎటూపోలేక.. ఎటుపోవాలో
పాలుబోక అన్నట్లుంది.
మరి?
అసలు విషయం తేల్చుకునేదెలా....?
మనసులో ఒకటే రచ్చ..సంఘర్షణ..
అతను తన కోసం వేచి చూసి  వెళితే
ఒక లెక్క…!
అలాకాకుండా తాను రాలేదని తెలుసుకొని,
వేచి చూడకుండా వెళ్ళిపోతే ఇంకో లెక్క..!
ఇందులో…
మొదటిది జరిగివుంటే తనమనసుకు ఊరట.
తృప్తి.తనమీద అతనికి వల్లమాలిన ప్రేమవుం
దని మనసుకు నచ్చచెప్పుకోవచ్చు‌‌..!
అలాకాకుండా….
రెండో ఆప్షన్ అయితే మాత్రం మనసు
ఓ పట్టాన మాట వినదు.ఎంతకూ దారికి
రాదు.
అందుకే …
మొదటి ఆప్షన్ జరిగి వుండాలని ఆమె
గట్టిగా కోరుకుంది..
తేరుకొని మరోసారి ఆ ఖాళీ కాఫీ కప్పును చూసింది….
ఆ ఖాళీ చేయబడిన కప్పు అడుగంచున....
అతడు కొద్దిగా వదిలెళ్ళిన కాఫీతాలూకు అవశేషం కనిపించింది..అంతే ఆమె కళ్ళు
వేయి మతాబుల్లా వెలిగాయి.ఆ ఖాళీ కప్పు
అడుగున అతడి ఎదురు చూపు కనిపించిం
ది..దాన్ని వదిలివెళ్ళింది అతడే అయివుంటా
డని నిర్ధారణ కొచ్చింది.
హమ్మయ్య ! అనుకుంది…
మనసు కొంత కుదుటపడింది..
ఇప్పుడామె మనసుకు ఊరట కలిగింది.
అప్పటిదాకా అల్లకల్లోలంగా వున్న ఆమె మనసు నిశ్చల ప్రేమ సముద్రమైంది.‌
ఇంతకూ అతడొదిలివెళ్ళిన ఆ ఎదురు
చూపుమరేదో కాదు…అతడి హృదయ
మే..అదీతనకోసమే..కేవలం తనకోసమే..
తన ప్రేమకోసమే..!
నిజానికి ఒక వేళ అక్కడతడున్నా,....అంత సంతోషం కలిగేది కాదేమో? తాను లేకున్నా
తన కోసం ఎదురు చూశాడన్న ' భావనే ' ..
చాలా గొప్పది.నిజమైన ప్రేమకు అదే కొల
మానం.ప్రేమికుల సంగమం కంటే.ఒకరి కోసం
ఇంకొకరు ఎదురు చూడటంలోనే నిజమైన గురించి
మజా,కిక్కుంది..ఇదే  అమలిన ప్రేమ కవిత సారాంశం..!
ఈ కవిత  రాసిన కవయిత్రి ఆర్. రమాదేవి గారికి అభినందనలు.!!
*ఎ.రజాహుస్సేన్..!!

 

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!